పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/352

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0159-6 శంకరాభరణం సంపుటం: 07-350

పల్లవి:
చెల్లునయ్యా యీచేఁతలు చెలియకు నీకును
చిల్లరచెనకులకు సిగ్గేయానందము

చ.1:
సతులకుఁ బతులకూ జవ్వనమే భాగ్యము
రతివేళలనెల్లా రహస్యమే వేడుక
తతితో మనసులకు తలపోఁతే పండుగ
సతమైన మోహాలకు సరసమే సౌఖ్యము

చ.2:
వొట్టిన తమకములకొద్దనుండుటే ఫలము
ముట్టినయాసలకు మోముచూపే తనివి
పట్టరానికోరికకు పచ్చిమాటే సోబనము
చిట్టుకపుచేఁతలకు చిరునవ్వే లాభము

చ.3:
ననుపైన కూటమికి నాటుగోరే సింగారము
పెనఁగుటకు కాఁగిటిబిగువులే సంపద
యెనసితివి శ్రీ వేంకటేశ యలమేల్మంగను
చనవులకును మోవిచవులె సామ్తాజ్యాలు