పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/35

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0106-4 శంకరాభరణం సంపుటం: 07-034

పల్లవి:
ఇందులోపలఁ దనకు నెందువారమె నేము
అందంబుగానతని నడుగరే చెలులు

చ.1:
తగులు గలిగిన యడల తమకమింతయు నమరు
నగినయడలను మిగుల నటనలమరు
తెగువ గలిగిన యడల తేఁకువలు గడునమరు
మొగమోట గల యెడల మోహంబులమరు

చ.2:
మనసు లెనసిన యెడల మాటలన్నియునమరు
ననుపు గలిగినయడల నయములమరు
చనవు గలిగిన యడల సరసమంతయునమరు
పెనకువలు గల యడల ప్రియములునునమరు

చ.3:
కూడియుండెటియడల గుఱుతులిన్నియునమరు
వాడికలు గలయడల వలపులమరు
యీడనే శ్రీ వేంకటేశుఁడిటు ననుఁ గూడె
వేడుకలు యీయెడల వేవేలునమరు