పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/347

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0159-1 మంగళకౌశిక సంపుటం: 07-345

పల్లవి:
మఱచితినంటా నీవు మమ్మెంత బుజ్జగించేవు
యెఱుక గలచోట యెట్టుండినా యేమి

చ.1:
అక్కడే పరాకైతే అట్టే యెచ్చరింతుఁ గాక
దిక్కరించి నిన్ను సాదించేనా నేను
మక్కువ నూరకుండితే మాట నేనాడింతుఁ గాక
చిక్కించుక గొరబులు సేసేనా నిన్నును

చ.2:
పెలుచవై రాకుండితే పిలువనంపుదుఁ గాక
చలమున నీతోను వేసరుకొనేనా
తలవంచుకుండితేను తమకము రేఁతుఁ గాక
తలుపుమాటుకుఁ బోయి తరితీపుసేసేనా

చ.3:
పవళించివుండితేను పాదములొత్తుదుఁ గాక
ఇవల వాసులు వంతులెంచఁ జూచేనా
వివరించి నన్నిట్టె శ్రీ వెంకటేశ కూడితివి
నవమైన నీచేఁతలు నవ్వించవా నన్నును