పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/345

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0158-5 పాడి సంపుటం; 07-343

పల్లవి:
ఎప్పుడూ మేలువాఁడవే యెరుఁగుదు నిన్నునేను
కప్పి వోరువనియ్యవు కాంక్షలే నన్నును

చ.1:
ఆవేళ నీవురావని అలుగఁదలఁతుఁ గాని
భావించితే నామనసు పట్లులేను
నీవంకఁ దుప్పేమీలేదు నేనెంచి చూచితేను
తావుకొన్న నాలోని తమకమే కాని

చ.2:
చేముట్టిపెనఁగవని చింతఁ దలవంతుఁ గాని
నీమోము చూడక నే మానలేను
కామించి నీగుణాలలో కడమలు మరిలేవు
ప్రేమపు నాకోరికలు పెనగోనీఁ గాని

చ.3:
పరఁగఁగ బరపుపై పంతాననుండుదుఁ గాని
సరిఁ గాఁగాటికి చేయి చాఁచకుండలేను
అరిది శ్రీ వెంకటేశ అలమేల్‌మంగ నేను
గరిమెనేలితివేలొ కాఁతాళింతుఁ గాని