పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/343

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0158-3 బౌళి సంపుటం: 07-341

పల్లవి:
ఆతని తలఁపు మీరే అడుగరే చెలులాల
కాతరములేని సిగ్గరిదాన నేను

చ.1:
మలసి యాతనితోను మారుమాటాడేనటవే
తలకొన్న మొగమోటదానను నేను
కలువలఁ దాఁకవేసి గద్దించేనటవే
నలువంక మెత్తని మనసుదానను నేను

చ.2:
జఱసి యతని జంకించఁగఁ గలనటవే
తఱితోడ వలచినదానను నేను
వెఱవక చెయివట్టి వెసఁ దియ్యగలనటే
కఱకరిలేని యిచ్చకపుదాన నేను

చ.3:
అంచల నాసలు చూపి యలయించేనటవే
మంచితలఁపలమేలుమంగను నేను
ఇంచుకంతా శ్రీ వెంకటేశు మీరేనటవే
వంచనసీయని చనవరిదాన నేను