పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/342

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0158-2 శంకరాభరణం సంపుటం: 07-340

పల్లవి:
ఎంత తమకమో చెలికేమి చెప్పేది
వింతవింతవేడుకలు వెల్లివిరిసీని

చ.1:
జారినపయ్యదతోడ సగము చన్నులు చూపి
నేరుపుల మాటలాడీ నెలఁత నీతో
కూరుములు గొసరుతా గోరఁజెమట చిమ్ముతా
తారుమారైవలపుల తన్నుఁదానెరఁగదు

చ.2:
కడుఁగొప్పు దువ్వుకొంటా కరమూలములు చూపి
వెడయాస నవ్వు నవ్వీ వెలఁది నీతో
నిడువాలుఁజూపులతో నిన్నుఁ దానొరసుకొంటా
తడఁబాటుచిత్తముతో తన్నుఁ దానెరఁగదు

చ.3:
బిగ్గెనొడ్డాణము గట్టి పిరిఁదిబటువు చూపి
అగ్గలమై కాలుదొక్కీనతివ నీతో
నిగ్గుల శ్రీ వేంకటేశ నిన్నుఁగూడి మొక్కు మొక్కి
తగ్గని కోర్కులతోడ తన్నుఁ దానెరఁగదు