పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/340

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0157-6 గౌళ సంపుటం; 07-338

పల్లవి:
తనసేవ నేఁజేయనా తగవు దప్పఁగాఁ గాక
చెనకీఁ దానిందుకేపో సిబ్బితయ్యీ నాకు

చ.1:
కడుఁ దమకాన నేను కస్తూరి నూరఁగాను
తడఁబడ నామీఁదఁ బాదము చాఁచీని
బెడిదమై ఆఁటదాని పెండెము వెట్టుకున్నాఁడు
చిడిముడి నిందుకేపో సిబ్బితయ్యీ నాకు

చ.2:
పొందుగా నేను గొజ్జంగ పువ్వుదండ గుచ్చఁగాను
చెంది నాబుజముమీఁదఁ జెయివేసీని
మందెమేళాన నెవ్వతో మట్టెలు వేలనున్నవి
చిందువందసేఁతకేపో సిబ్బితయ్యీ నాకు

చ.3:
పాలుపుగా నేఁదట్లుపునుఁగు వాసించఁగాను
అలమీ శ్రీ వేంకటిశుఁడంతలో నన్ను
మొలనూలేడదో వురమునఁ బెట్టుకున్నాఁడు
చెలరేఁగి కూడఁగానే సిబ్బితయ్యీ నాకు