పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/338

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0157-4 కాంబోది సంపుటం: 07-336

పల్లవి:
నీవిభుని ప్రియములు నెట్టునఁ జేకొనఁగదే
కావలసిన మేలెల్లాఁ గాచుకున్నది

చ.1:
తనంతనయ్యేపనికి తమకించఁ బనిలేదు
వినవలసినందుకు వేసరవద్దు
మనసు నమ్మినందుకు మరివిచారములేల
కొనసాగేయందులకుఁ గోపమేఁటికి

చ.2:
ఆస గలిగినచోట అంటు విడువఁదగదు
వాసితోడి పొందెపుడు వంచించరాదు
యీసులేక పెనఁగితే యియ్యకొనకుండనేల
చేసూటిని మెలఁగఁగ చెప్పించఁ జనదు

చ.3:
కూటపుమాటలాడఁగఁ గొసరేదందము గాదు
నీటునఁ గాఁగలించఁగ నేరమెక్కదు
యీటున శ్రీ వేంకటేశుఁడేలె నిన్నునింతలోనె
సాటికి బేటికి మీలో జంటలిఁకఁ బాయవు