పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/336

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0157-2 శుద్దవసంతం సంపుటం; 07-334

పల్లవి:
బలిమిసేయక నీవు పదవమ్మా
చెలియ నామనసు చేకొనవమ్మా

చ.1:
ననుపు లేనిచోట నవ్వుటకంటెను
జునిగి వాదులడుచుటె సుఖము
మనసు రానిచోట మాటలాడుకంటెను
మునుపనే తనలోనిమోనమే సుఖము

చ.2:
ప్రేమలేనిపతిఁ బిలుచుకంటెను
సోమరై వేగించుటె సుఖము
కామించనిరతిఁ గరఁగుటకంటెను
ఆమారు కంభమునలముటె సుఖము

చ.3:
ఒల్లమి సరిఁ గూచుండుటకంటెను
చల్లఁగఁ దొలఁగుటె సమసుఖము
ఎల్లగ శ్రీవేంకటేశుఁడు నన్నుఁగూడె
కొల్లగనిదియే కోరుట సుఖము