పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/329

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0156-1 వరాళి సంపుటం: 07-327

పల్లవి:
ఏమని పొగడవచ్చునిట్టి వింత సింగారము
నేమముతో రమణుఁడ నీభాగ్యమాయను

చ.1:
కమలముమీఁద రెండుకలువలు వికసించె
జమళినందువల్లనే సంపెంగ వూచె
తమితో నాకొట్టఁగొనఁ దగదొండపండు వండె
అమరనిన్నియుఁగూడి అతివమోమాయను

చ.2:
కన్నెయరఁటులమీఁద కంతునిరథము చాలె
పన్ని సింహమొకటి యాపైనెక్కెను
సన్నలనామెకముపై సతి జక్కవలు వాలె
ఇన్నియుఁ గూడఁ గూడ నింతిరూపమాయను

చ.3:
అంచెలఁ గూర్మాలు రెండుహంసలతోఁ బొందుసేసె
పొంచి బిసాలు సంకముపొత్తు గూడెను
నించి శ్రీ వెంకటేశుఁడ నీసందిటఁ బట్టఁగా
యెంచక వేవురముపై నిందిరాదేవాయను