పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/325

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0155-3 మధ్యమావతి సంపుటం: 07-323

పల్లవి:
వెలఁది చక్కఁదనము వేరొకటి గాదు సుండి
చెలులార చూడరమ్మ చెప్పరాదు వింతలు

చ.1:
చెందమ్మిరేకులలోనఁ జేరి తుమ్మిదలు వాలె
కందువఁ జెలికినవే కన్నులాయను
చందమై వొకతీగెపై జక్కవపిట్టలు వాలె
గొందినవే యెంచిచూడఁ గుచములాయను

చ.2:
నిండుఁజందురునిమీఁద నీలముల గని వుట్టే
కొండవంటి చెలికవే కురులాయరు
పండుటరఁటులమీఁద బలుసింహమదె యెక్కె
మెండగు నెన్నడుమై మించెనిదె యిప్పుడే

చ.3:
పచ్చని చిగురుమీఁద పగడపుఁబండు వండె
అచ్చపుఁ జెలియకదె అధరమాయ
ఇచ్చకుఁడై శ్రీవేంకటేశుఁడింతలోఁ గూడె
నిచ్చకల్యాణములై నిలిచె నిన్నిటను