పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/322

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0154-6 కాంబోది సంపుటం; 07-320

పల్లవి:
ఇందరి భావము నీవే యెరుఁగుదాకె యెరుఁగు
యిందుకుఁగా నింతసేయనేమిటికయ్యా

చ.1:
సుదతి నిన్నుఁ గోపానఁ జూడకొక్క మాను చూచె
అదె యొక్క మానితో మాటాడె సొలసి
పదరి పరవాశానఁ బట్టినొక్క మానికొమ్ము
వొదిగి యొకమానిపై నుస్సురనెను

చ.2:
మానిని యొకమానిపై మదనరాగము చిమ్మె
ఆనిన పూఁదేనె యొక్క మానఁ జిలికె
పూనిన నీబాసలకు నొకమానిపై నవ్వె
తానుడుకు దీర నాకమానిపాంతఁ బాడెను

చ.3:
అంత నీవు దగ్గరితే అందు మాను చేతనంటె
కాంత నీమారొకమాను కాలఁదన్నెను
ఇంతలో శ్రీవేంకటేశ యింతి నీవు గూడఁగను
వింతగా నీతరువుల విరులు నీకిచ్చెను