పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/320

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0154-4 శ్రీరాగం సంపుటం: 07-318

పల్లవి:
బుద్ది చెప్పవే పతికిఁ బొద్దాక వింత వలెనా
వొద్దనుండే యింతసేపు వుపచారాలేలే

చ.1:
నిమ్మపండియ్యఁగ వచ్చీ నెట్టున నావురమున
నిమ్మపండ్లు రండవే నేనేమి సేసేనే
తమ్మిపువ్వియ్యఁగ వచ్చె దాకొని నాపాదముల
తమ్మివిరులు రెండవె తనవి నాకేలే

చ.2:
నీలము గానుక యిచ్చీ నిక్కిన నాతురుమున
నీలములెన్నైననివే నేనేమి సేసేనే
యేలే యద్దము నాచేతికిచ్చే నాచెక్కులివే
మేలిమి యద్దాలు రండు మించేది గానఁడా

చ.3:
నిగ్గముత్యాలియ్య వచ్చీ నేఁడు నామేనిచెమట
నిగ్గుముత్యాలై వూరీ నేనేమి సేసేనే
అగ్గమై శ్రీ వెంకటేశుఁడంతలోనే ననుఁగూడి
వొగ్గి మోవియిచ్చి రతులనోలలార్చెఁ జాలదా