పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0106-11 సామంతం సంపుటం: 07-031

పల్లవి:
మగువలతోడిదేల మందెమేళాలు
తగినయంతే కాక తమకమేలయ్యా

చ.1:
పెక్కుమాటలాడితేను ప్రియ మెల్లాఁ జవుకౌను
యెక్కుడు సుద్దులు నన్నునేలడిగేవు
మొక్కులే సారెకునైనా మోపులై వేసటవుట్టు
యెక్కసక్యాలకుఁ బాదమేల పట్టేవయ్యా

చ.2:
విడువక నవ్వితేను వెస మొగచాటగును
అడరి మాతో సరసాలంత యేలయ్యా
యెడయక చూచితేను యెదిరికి సిగ్గువుట్టు
కడు నీయెదుటనేల కమ్ముకొనేవయ్యా

చ.3:
బలువై కౌఁగలించితే పరవశములు మించు
నెలకొని మమ్మునెంత నెట్టుకొనేవు
వెలయ శ్రీ వేంకటేశ వేమారు నన్నుఁ గూడితి
వలపులజడి యంత వంచితివో అయ్యా