పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/319

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0154-3 ముఖారి సంపుటం: 07-317

పల్లవి:
ఎటువంటి తమకమో యెదుటనల్లదె చూడు
యిటు నీచిత్తముకొలఁదిఁకనేమి యంపునో

చ.1:
కాంత నిన్నుఁబిలువ నీకడకు నన్నంపి యట్టే
కాంతుఁడ నీపేర లేకలూనంపె
దొంతిగా నావెంటనె తొంగలిచూపులునంపె
యింతట విచ్చేయకున్న యిఁకయేమి యంపునో

చ.2:
కామిని నాచేత నీకుఁ గానికంపె తోడనే
మైమరచి యీడకుఁ దా మనసూనంప
కోమలపుమాఁటల కోవిలయెలుగులంపె
యేమిట విచ్చేయకున్న నింకనేమి యంపునో

చ.3:
ఉంగరమానవాలంపె వువిద వాయువేగాన
అంగపు నిట్టుర్సుగాలి అదివో అంపె
తంగక శ్రీ వెంకటేశ తన నడపులు నంపె
యింగితాన నిదెకూడె యింకనేమి యంపునో