పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/315

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0153-5 నాదరామక్రియ సంపుటం; 07-313

పల్లవి:
కాంతయైతే నీకుఁ జేసీ కమలముపైఁ దపము
వంతుల రమణుఁడవు వరమియ్యవయ్యా

చ.1:
కూటువ నీయింతికనుఁగొనలఁ బోలుదుమని
నీటనే తపము సేసీ నీరజములు
చాటి కొమ్మతురుముతో సరివచ్చేమని మింట
మీటుఁదపములు సేసీ మేఘములు

చ.2:
మెండగు చెలినడుము మించేమనుచు నేఁడు
కొండలఁ దపాలు సేసీ కోరి సింహలు
అండ నీసతిచన్నుల అందములకు వనాల
చండిఁ దపములు సేసీఁ జక్రవాకాలు

చ.3:
యీవనితపాదముల యీడుకుఁగా చిగురులు
దావతిఁ దపాలు సేసీ తరువులపై
శ్రీవేంకటేశ నీవు చెలినిట్టే కూడుమని
భావజుఁడు తపియించీఁ బంచాన్నినడుమ