పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/312

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0153-2 శంకరాభరణం సంపుటం: 07-310

పల్లవి:
ఘనుఁడవు నీమహిమ గన్నవారెవ్వరు
మినుకుల కొంతకొంత మెచ్చుటింతేకాని

చ.1:
జలధినీరు సొచ్చి సారెసారెనీఁదవచ్చు
ములుగుచుఁ గొండైన మోవవచ్చును
యిలయెల్లనెత్తవచ్చు నేరూపైనఁ గావచ్చు
బలిమి నీచిత్తమే పట్టరాదుగాని

చ.2:
ఆకసమింతంతని యంటికొలవఁగవచ్చు
చేకొని ఘోరతపము సేయవచ్చును
రాకాసులఁ జంపవచ్చు రామలఁగలయవచ్చు
ఆకడ నీగుట్టు తెలియఁగరాదు గాని

చ.3:
పట్టరానివ్రతములు పట్టించి సేయించవచ్చు
గట్టు రాయైనాఁ గడుఁ గరఁచవచ్చు
ఇట్టె శ్రీవేంకటేశ యిటు నన్ను గూడితివి
దిట్టు నీనాలోన భేదించరాదుగాని