పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/310

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0152-5 పాడి సంపుటం; 07-308

పల్లవి:
ఒకరికొకరి అన్యోన్యము చూడరే
సకలమునెరిఁగిన సరసులె వీరు

చ.1:
చెలిచంద్రముఖముసిరుల నాయకుఁడు
కలువలకన్నులఁ గడుఁ జూచె
చెలువ సూర్యతేజపుఁ బతిని మరల
జలజాక్షంబుల సతియును జూచె

చ.2:
తారని బింబాథరితో రమణుఁడు
కోరి చిలుకపలుకులఁ బలికె
తోరపు మేఘపుతురుము విభునితో
ఆరయ మయూరయానయుఁ బలికె

చ.3:
పడఁతిదేహలత ప్రాణనాథుఁడిటు
వొదలి చెమటచెరువులఁ దడిపె
కడఁగిన శ్రీవేంకటగిరిపతితోఁ
దడవి సింహమద్యయునొనఁగూడె