పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0105-6 రామక్రియ సంపుటం: 07-030

పల్లవి:
ఏల మమ్ము రట్టు సేసేవింతటిలోనే పెను
వేలనే గడెవెట్టితి వెళ్ళనియ్య నిన్నును

చ.1:
వొద్దనఁగాఁ బొయ్యేవు వొంటిఁ జిక్కించుక యాపె
అద్దలించి యేమైనాననకుండీనా
అద్దొ నాతో నీవు అలిగి యందు చేరిన
పొద్దుగాని పొద్దనక పొందులు సేసేరా

చ.2:
తుమ్మఁగానే లేచేవు తొయ్యలి యెవ్వతెయైనా
దిమ్మురేఁచి వాదుదీసి తిట్టకుండీనా
యెమ్మెల నాతో మేకులకెవ్వతెఁ బలిపించినా
నమ్మరాదనక నీతో నవ్వవచ్చేరా

చ.3:
మొక్కఁగా నడుగిడేవు ముందటనెవ్వతెయైనా
చిక్కించుక చేఁతలెల్లాఁ జేయకుండీనా
మక్కువ శ్రీ వేంకటేశ మగిడి నన్నుఁ గూడితివి
తక్కిన వారు నవ్వక తాము లోనయ్యెరా