పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/302

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0151-4 శ్రీరాగం సంపుటం; 07-300

పల్లవి:
ఎవ్వరికిఁ బోరాదు యెదిరిఁజేసిన ఫలము
దివ్వెయై చేచేత దిష్టమౌఁగాని

చ.1:
వేమారు విరహులను వెతలఁ బెట్టిన ఫలము
కామునికి నేఁటేఁటఁ గనలవలసె
దీమసపుఁ గోవిలలు తెగువఁ బలికిన ఫలము
ఆమనియెడలదాఁక నణఁగుండవలసె

చ.2:
చందురుఁడు కాముకుల జాలిఁబెట్టిన ఫలము
కుందుచును నెలనెలకుఁ గొవరవలసె
మందానిలుండెదిరి మనసుగలఁచిన ఫలము
కందువగు శేషునికిఁ గాటియ్యవలసె

చ.3
రావమున దంపతుల రవ్వసేసిన ఫలము
తావిసంపెఁగకలులు తలఁకవలసె
శ్రీవెంకటేశ్వరుఁడు చెలియనిటు గూడఁగా
భావమున నిన్నియును బంతమీవలసె