పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/297

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0150-5 బౌళిరామక్రియ సంపుటం: 07-295

పల్లవి:
ఏమనఁ గలదే యిందుకును
ఆమనినాఁడే అదవధలాయ

చ.1:
తరచగు తురుమున దాకొనె మేఘము
మెరుఁగుల కన్నుల మెరిచె నిదే
వరదల చెమటల వానలు గురిసెను
తెరవకు దప్పులు దీరకపోయ

చ.2:
పాలుపగు తనువునఁ బులకలు మొలచెను
నులిఁ గోరికలెన్నులు వెడలె
బలిమిఁ గుచంబులఁ బాలు గొనియెనిదె
తలిరుఁబోఁడి మతిఁ దనియకపోయ

చ.3:
కాంతను శ్రీ వేంకటపతి గూడఁగ
బంతిరతుల వైభవమలరె
అంతట నరగొరలన్నియు దీరెను
దొంతిమదములకుఁ దుదలేదాయ