పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/295

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0150-3 వరాళి సంపుటం: 07-293

పల్లవి:
ఎరఁగను కపటాలు యెరిఁగి మరతురా
చిరుతపాయముదాన చిత్తము నీకెట్టిదో

చ.1:
మలసి కోపింతుఁగాని మాటాడకుండలేరా
అలసి జంకింతుఁగాని అలుగలేరా
తలఁపె తెగుదు గాని దగ్గరకుండఁగలేరా
సిలుగు నామోహమిది చిత్తము నీకెట్టిదో

చ.2:
నేరములె యెంతుఁగాని నిన్ను మెచ్చకుండలేరా
దూరి పలుకుదుఁగాని తొలఁగలేరా
ఆరసీ మొక్కుదుంగాని అవ్వలిమోము గాలేరా
చేరిన నాభావమిది చిత్తము నీకెట్టిదో

చ.3:
పచ్చిగా నవ్వుదుఁగాని పంతమియ్యకుండలేరా
గచ్చుల నీవంటితే నే కాదనలేరా
నిచ్చలు శ్రీవేంకటేశ నిన్నుఁ గూడితినిదే
చెచ్చెర నాగుణమిది చిత్తము నీకెట్టిదో