పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/292

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0149-6 పాడి. సంపుటం; 07-290

పల్లవి:
ఇదివో యింతట వరంబీవయ్యా
కదిసి ప్రత్యక్షంబు గావయ్యా చెలికి

చ.1:
తరుణి నిన్ను బెడఁబాసి తపము శాయఁగ దొడఁగె
విరహంపు నులిగురుల విరజడలతో
అరమోడ్పు కనుఁగొనల ఆనందములతోడ
బరువైన నిట్టూర్చు పవనముతోడ

చ.2:
ముదిత నినుఁ దలపోసి మునిమార్గమునఁ జెలఁగె
మొదల నివ్వెరపాటుమోనంబుతో
వదలని పులకగముల వనవాసములతోడ
అదనెరఁగని నిరాహరంబుతోడ

చ.3:
ఉవిద నీతోఁగూడి యోగంబు సాధించె
వివరంబుతోడ శ్రీ వెంకటేశ
నవకమగు రతుల నానావిధంబులతోడ
కవగూడియున్న చిరకాలంబుతోడ