పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/289

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0149-3 రామక్రియ సంపుటం: 07-287

పల్లవి:
ఒకటిఁ బోలిచిన వేరొకటి మరి తోఁచీని
సకలముఁ బోలిచేము సతిసింగారములు

చ.1:
కలువలుఁ జకోరాలు గండుమీలుఁ దామరలు
చలిముత్తెపుఁ జిప్పలు సతికన్నులు
అలులు నీలపుమణులంధకారము మేఘము
నలుపులరాశివో నలినాక్షితురుము

చ.2:
జక్కవలు నిమ్మపండ్లు సరిఁ బూగుత్తులుఁ గొండ
లెక్కువ మరుమిద్దెలు యింతిచన్నులు
చుక్కలు సురవొన్నలు సూదివజ్రాలు గోళ్ళు
అక్కరయేనుఁగ తొండాలరంట్లే తొడలు

చ.3:
సోగతీగెలు తూండ్లు దతి బాహువులివె
చేగ చిగురు లత్తిక చెలిపాదాలు
యీగతి శ్రీవేంకటేశ యింతి నీవురముమీఁద
బాగుగ నమరి పైఁడిపతిమఁ బోలినది