పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/287

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0149-1 సామంతం సంపుటం: 07-285

పల్లవి:
నీ విభుఁడు వచ్చుదాఁక నిచ్చలాన నుండే వే
వేవేలకును రేయి వేగించలేమే

చ.1:
పూయకు కస్తూరి మేనఁ బొద్దుగూఁకెఁ జీఁకటంటా
నోయమ్మ చందురుఁడుదయించెను
చాయల వెన్నెలదాఁకి చల్లజంపు యెండలంటా
ఆయెడ నీవు వేఁగఁగ నదిచూడలేమే

చ.2:
గందము పుయ్యకువే కలికి నీకుచములే
చందనపుఁ గొండలంటాఁ జల్లీ గాలి
అందులో పూవుతావి దాఁకి అమ్ముమొనలంటెనంటా
మందమై మేనుమరవఁగ మందులుదేలేమే

చ.3:
వద్దేలే కుంకుమలు వసంతపుఁ జిగురంటా
నద్దితేఁ గోవిల భూతమని లోఁగేవు
నిద్దపు శ్రీ వెంకటాద్రినిలయుఁడిట్టె కూడె
యిద్దరి మీవలపులు యింక నెంచలేమే