పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/282

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0148-2 వరాళి సంపుటం: 07-280

పల్లవి:
నెలమూఁడు శోభ్రనాలు నీకు నతనికిఁ దగు
కలకాలమును నిచ్చకల్యాణమమ్మా

చ.1:
రామనామమతనిది రామవు నీవైతేను
చామన వర్నమతఁడు చామవు నీవు
వామనుఁడందురతని వామనయనవు నీవు
ప్రేమపు యిద్దరికి పేరుబలమొకటే

చ.2:
హరి పేరాతనికి హరిణేక్షణువు నీవు
కరిఁ గాచెఁ దాను నీవు కరియానవు
సరిఁ దా జలధిశాయి జలధికన్యవు నీవు
బెరసి మీ యిద్దరికిఁ బేరుబలమొకటే

చ.3:
జలజనాభుఁడతఁడు జలజముఖివి నీవు
అలమేలుమంగవు నిన్నలమెఁ దాను
ఇలలో శ్రీ వేంకటేశుఁడిటు నిన్నురాన మెచె
పిలిచి పేరుచెప్పెఁ బేరుబలమొకటే