పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/281

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0148-1 గుండక్రియ సంపుటం: 07-273

పల్లవి:
చెలువుఁడ చూడుమా యీ చెలియసింగారము
మెలఁగి మెలఁగి మంచిమేలెల్లాఁ గూడెను

చ.1:
గక్కన సంపెంగపూవు కలువలు దామరయు
నొక్కట నీచెలిమెమై యొనగూడెను
పక్కన వజ్రములును పగడాలు నీలములు
అక్కరతోఁ గడుకొని అందుకే తోడాయను

చ.2:
కొండలును దీగెలును గుహలోని సింహమును
మెండుకొని యీవనితమేనాయను
గండుఁదుమ్మిదల చేరుఁ గనకము శంఖమును
అండనె పొత్తుగలిసి యందుకుఁ దోడాయను

చ.3:
చిగురును నరంట్లు చిత్తజుబండికండ్లు
తగనింతిపిరుఁదుఁ బాదాలుఁ దొడలై
నిగిడి శ్రీ వేంకటేశ నీకు మంచివస్తువుల
వగలలమేలుమంగ వనితయై కూడెను