పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/277

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0147-3 పాడి సంపుటం; 07-275

పల్లవి:
తొల్లి నేఁజేసిన గురుతులంటానేలాడేవు
తెల్లమిగనింక నీవు తెలుకోవయ్యా

చ.1:
మచ్చికనెవ్వతో నీమంచిరూపు గోడ వ్రాసి
నచ్చుల చూపులు నీమై నాఁటించఁబోలు
ఇచ్చట నీతనువుననింతటా రేకలు నిండె
చెచ్చెర మీఁదటిమాఁట చింతించుకోవయ్యా

చ.2:
పొంచి మరెవ్వతో నిన్నుఁ బొందుగా మాఁకునఁజేసి
చుంచుల నీమోవి చవిచూడఁబోలును
అంచల నీయథరాననవిగో కెంపులు నిండె
దించి ఆవొచ్చాలు నీవే తీరుచుకోవయ్యా

చ.3:
బత్తితో నెవ్వతో నిన్ను బయలు దలఁచి యాడ
వొత్తి కాఁగిలించుకొని వుండఁబోలును
ఇత్తల శ్రీ వేంకటేశ ఇటు నేఁ గాఁగిలించితి
హత్తి నిందలాడితి నీకవి యేఁటికయ్యా