పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/276

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0147-2 మాళవిగౌళ సంపుటం: 07-274

పల్లవి:
ఇన్నిటా నీవేకరాజ్యమేలుదు గాక
మన్ననకాంతవైతివి మరి యాలే వెలితి

చ.1:
ఈతల నీరమణుఁడు యే పొద్దు చూచిననిట్లే
చేతికి లోనై యుండగఁ చింతలేలా
కాతరపుఁజెలులెంత కాతాళించి దూరినాను
యేతులనందువుగాక యిఁకనేలే వెరవు

చ.2:
చెప్పినట్టుల్లాఁ జేయ చేరి యాతఁడు గలఁడు
చిప్పిల నీవు చెయిసేసుకోనేలే
పుప్పతిల్లి సవతులు వొరసి యెంత చూచినా
నెప్పుననుందువుగాక నీకేలే వెరవు

చ.3:
శ్రీ వేంకటేశ్వరుండు చేకొని నిన్నుఁ గూడి నీ
భావములోనుండఁగాను పదరనేల
వేవేలకునిందరును వెగటువాయ మొక్కిరి
చేవ మీరి నీచేఁతలే చెల్లెనేలే వెరపు