పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/272

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0146-4 శుద్దవసంతం సంపుటం; 07-270

పల్లవి:
చిత్తము వచ్చినట్టల్లా సేతువుగాక వోరి
పొత్తుల నీబాసలకు పూఁటయేది

చ.1:
రొట్లెకును రేవేది రుచిగొనుటేకాక
వొట్టిన నీ కోరికలకొడియేది
వెట్టికిని వెలయేది వివరించి చూడఁబోతే
గుట్టుతో నీవిద్యలకు గురియేది

చ.2:
చక్కెరకు మొదలేదిసంతసించుకొంటగాక
మిక్కిలి నీనవ్వులకు మేర యేది
చుక్కలకు లెక్కలేవి చూచుటింతేకాక నీ
అక్కజపు సుద్దులకు అవుఁగాములేవి

చ.3:
కప్పుర విడెములోన కారమెంచఁ జోటేది
గుప్పేటి నీఁకాగిటిలోఁ గొసరేది
అప్పుడె శ్రీ వేంకటేశ ఆలమేలుమంగ నేను
దప్పీదీరఁ గూడితివి తతియెంచనేది