పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/271

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0146-3 బౌళిరామక్రియ సంపుటం: 07-269

పల్లవి:
మేలుగా నీ మేకులు
వాలుఁజూపులట్టే పంచేవు

చ.1:
చెంది నిన్నాతఁడు చెనకఁగా యేమే
కందువలంటక కసరేవు
యిందులోనే కొన్నియెమ్మెలా విడె
మంది యిమ్మనఁగ నలసేవు

చ.2:
పేరుకొని నిన్నుఁ బిలువఁగా యేమే
కూరిమి గొసరక కొంకేవు
నేరుచుకొంటివే నిన్నిట్లూ పతి
గోర గీరితేను గొణఁగేవు

చ.3:
నిండుఁగాఁగిట నించఁగా చన్నుఁ
గొండలనొత్తక గునిసేవు
అండనే శ్రీవేంకటాధీశుఁడు గూడె
మెండుకొనఁగానే మించేవు