పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/270

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0146-2 కేదారగౌళ సంపుటం: 07-268

పల్లవి:
ఇంతవాఁడవు గాకున్న యిన్నినేల సేసేవు
చెంతల నీసరితెలు చూచేనింతేకాక

చ.1:
వొట్టుక నేనేమనిన వూరకే వున్నాఁడవు నీ
గుట్టుతోడిచేఁ తలకు కొసరా యిది
యిట్టె నే నెంతసేసినా యించుకాఁ గోపగించవు
తిట్టమై చిన్ననాఁడె సాదించితివో యిది

చ.2:
తప్పక చూచితే నట్టే తలవంచుకుండేవు
వొప్పుగా నీవొళ్ళఁ గలవోజా యిది
తప్పు నీపై మోపినాను తగినంతే నవ్వేవు
చప్పఁగాని నిజగడుసుఁ జదువా యిది

చ.3:
కందువ నేఁగూడఁగాను కలకల నవ్వేవు
దిందుపడ్డ నీ తరితీపా యిది
అందగాఁడ శ్రీ వేంకటాథిప నన్నుఁ గూడితి
విందుల ని విటరాచవిద్దెలా యివి