పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0105-2 మాళవిగౌళ సంపుటం: 07-026

పల్లవి:
మరిగేమి నెఱఁగను మంకు గొల్లదాన నేను
సరిలేని నవ్వులతో సరసమాడుదును

చ.1:
బలిమి నేఁ జేయఁ గాని పంతమాడి నిన్నునిట్టె
వలపించి నీ మోము వాడు దేర్తును
చలము సాదించఁ గాని చనవు చేసుక నీ
వెలలేని మోవెల్లా వేడుకల నింతును

చ.2:
బొమ్మల జంకించఁ గాని పొద్దు పొద్దుఁ గాచుకుండి
సమ్మతించ నీ మనసు జట్టిగొందును
చిమ్ముచుఁ గొసరఁ గాని చతులు నీపైఁ జాచి
ఉమ్మడి నా గోరి కొనలొడలెల్ల నింతును

చ.3:
నేరమెంచఁ గాని నేను నీతోనే మాఁటలాడి
చేరువ నీ మన్ననలు చేకొందును
యీరీతి శ్రీ వేకంటేశ యిట్టె నన్నుఁ గూడితివి
పేరుకొని యిఁక నిన్ను ప్రియాన మెప్పింతును