పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/269

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0146-1 భైరవి సంపుటం: 07-267

పల్లవి:
ఏమి సేతువు నీవు యిందరికిఁ గలిగినదే
నీమనసుకిచ్చకమే నేర్తు నేనయ్యా

చ.1:
తగులు గలవారికిని తమకములె చెలరేఁగు
యెతగసక్కెమాడినా యెగ్గులేదు
పగటు నగవులె కాని బ్రయమించుకా లేదు
అగడుసేసిఁక నిన్ను నాడనేలయ్యా

చ.2:
ఆసగలవారికిని అంగములెరఁగరావు
దోసమని పుణ్యమని తోఁచదొకటి
వేసటించుకలేదు వెంటవెంటనె తిరుగు
కోసి రాచిఁక నిన్నుఁ గొసరనేలయ్యా

చ.3:
చవులు గలవారికిని సమరతులె పనులగును
దివములును రాత్రులు తెలియదెప్పుడును
ఇవలనిదె శ్రీ వేంకటేశ ననుఁ గూడితివి
జవళి నీతో మాకు చలములేలయ్యా