పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/265

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0145-3 పాడి సంపుటం; 07-263

పల్లవి:
ఊరకున్న వారినేల వుష్పటించేవే
దూరులేక దూరితేను దోసముగాదా

చ.1:
ఎక్కడికెక్కడి సుద్దులేదో మనసునఁబెట్టి
చక్కఁ జూడనైతినంటా సాదించేవు
వొక్కట్టిపై వొక్కటివేశూరకె వాదడిచితి
అక్కరతోఁ జేయివట్టితే అపరాధమా

చ.2:
పనిలేని పనులకు పంతములెక్కించుకొని
చనవుననవునంటా సాదించేవు
అనుమానములకుఁగా అట్టెవొలలు వేసితి
నినుఁ గాగలించితేనే నేరమాయనా

చ.3:
తమకమెడలేనిది తనువునఁ బెట్టుకొని
సమమోహము లేదంటా సాదించేవు
భ్రమదీర శ్రీవెంకటపతినంటా నన్నుఁగూడి
జమళిఁ బాయవు నేఁడు సంతోసించితివా