పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/260

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0144-4 శ్రీరాగం సంపుటం; 07-258

పల్లవి:
నెపములన్నియు నీవు నేరిచినవే
కపటాలు మాయెడకు గడించకువయ్యా

చ.1:
చిగురువంటిది మేను శిలవంటిది మనసు
యెగసక్యములు మాతోనేలయ్యా
నగపువంటిది తమి నామువంటిది వలపు
తగవులఁబెట్టి మాతో తక్కించకువయ్యా

చ.2:
అద్దమువంటి వయసు అమ్మువంటికోపము
సుద్దుల మా మనసేమి సోదించేవయ్యా
పొద్దువంటిదడియాస పూఁసవంటిది గుణము
గద్దించి మమ్మేల నీవు కైకొలిపివయ్యా

చ.3:
చుట్టుమువంటిది వావి సూదివంటిది చూపు
చెట్టువట్టి మమ్మునేల చెనకేవయ్యా
యిట్టె శ్రీ వేంకటేశ యెనసితివిటు నన్ను
పట్టిన పంతముదక్కెఁ బదరకువయ్యా