పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0105-1 సాళంగనాట సంపుటం: 07-025

పల్లవి:
మేకులు నావద్దనే మెరసీనా
యీకతలెఱుఁగుదు నన్నేల పిలిచీనే

చ.1:
సంగడిఁ గూచుండి సరసములాడి యాపె
అంగము కస్తూరి పూఁతలంటించుకొనె
ఎంగిలి దేహము తోనే యీడకు విచ్చేసినాఁడు
యింగిత మెఱిఁగితి నన్నేల పిలిచీనే

చ.2:
నమ్మిక లాపెకు నిచ్చి నయగారమున నాపె
సొమ్ములు దాఁబెట్టుకొనెఁ జూడఁగానే
అమ్మరొ నా మంచముపై నాపెఁదానునున్నవాఁడు
యెమ్మెలెల్లాఁ గంటి నన్నునేల పిలిచీనే

చ.3:
చేరి యాపె వాసన చూచిన చెంగలువ బంతి
మేరతోఁ దాఁబట్టుకుండి మీఁదవేసెను
యీరీతి శ్రీ వేంకటేశుఁ డిప్పుడిట్టై నన్నుఁగూడి
యీరానిచనవులిచ్చె నేల పిలిచీనే