పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/258

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0144-22 గుజ్జరి సంపుటం: 07-256

పల్లవి:
ఒక్కటే విన్నపము వొచ్చెములేనిమాట
యెక్కువగా నిందరిలో నలవయ్య మమ్మును

చ.1:
యెగదిగఁబోసితేను యెంతేసినేరవు నీవు
జిగిఁ బనిగొనేవారిచేతిదేకాక
బిగిసి కామినులకుఁ బిండంతే నిప్పటి నీవు
యెగసక్కెములు మాని యేలవయ్య మమ్మును

చ.2:
ఇచ్చకములాడితేను యేపని సేయవు నీవు
కొచ్చికొసరేటివారి కొలఁదేకాక
నిచ్చలుఁ గామినులకు నీరు కొద్ది తామెరవు
యెచ్చరిక తోడ నికనేలవయ్య మమ్మును

చ.3:
యియ్యకోలై నడచితే నెందరిఁ గూడవు నీవు
నెయ్యానఁ బెండ్లాడేవారి నేమమేకాక
కొయ్య వై శ్రీవేంకటేశ కూడితివి నన్నునిట్లే
యెయ్యెడఁ బూఁపలే పిందెలేలవయ్య మమ్మును