పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/249

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0142-5 ముఖారి సంపుటం: 07-247

పల్లవి:
కంటకములాడనేల కాఁతాళమేఁటికి నీతో
మంటదీర నా పనులు మానివుండేఁ గాక

చ.1:
కోపగించేనా నీతో కొప్పువట్టి తీసితేను
యేపున ముడుచుకొనేనే మాయను
పైపై దొరలతోడి పంతాలకు నేమిపని
ఆపరాకై వానగుంటలాడుకొనేఁ గాక

చ.2:
కమ్మటిఁ దిట్టేనా నిన్ను కాలు నీవు దొక్కితేను
యెమ్మెలేక తీసికొనేనే మాయను
దిమ్మరి విభునితోడ దీకొనేవాదులేల
యిమ్ములఁ జుక్కలై నానెంచుకొనేఁ గాక

చ.3:
పక్కన నొట్టువెట్టేనా పచ్చడము గప్పితేను
యిక్కువలు గరఁగేను యేమాయను
నిక్కి శ్రీవేంకటేశుఁడ నిన్నుఁగూడి కొంకువద్దా
చక్కనైతి నీమోవి చవిచూచేఁగాక