పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/245

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0142-11 గుజ్జరి సంపుటం: 07-243

పల్లవి:
తెలిసినవాఁడవు ధీరుఁడవిన్నిటా నీవు
చలము సాదింతురా సతులతో నీవు

చ.1:
అప్పటి మానవు మాటలాపెతో నీవు
కప్పురమిచ్చినమీఁద గలదా వాదు
చెప్పరాని తిట్టుదిట్టి చేయెత్తి మొక్కితేను
వొప్పుగొనవద్దా మఱి వొరట్లేమిటికి

చ.2:
తలవంచుకున్నాఁడవు తరుణియెదుట నీవు
సెలవి నవ్వినమీఁద సేతురా యింత
కలువపువ్వులవేసి కౌఁగలించుకొంటేను
అలుకదీరఁగవద్దా ఆనలు మరేఁటికి

చ.3:
బింకములు నెఱుపేవు ప్రియురాలి యెదుటను
సంకెలు దీర్చినమీఁద చలమేఁటికి
అంకెల శ్రీవేంకటేశ ఆలయించి నిన్నుఁగూడె
మంకులు మానఁగవద్దా మదము మరేటికి