పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/243

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0141-5 శ్రీరాగం సంపుటం; 07-241

పల్లవి:
ఏల కొనఁబెట్టేవే యెందాఁకా మాటలు
నాలితో వండినకూడు ననుఁబాయే కాదా

చ.1:
పెక్కువనితలమీఁది ప్రియము గలవానికి
యెక్కడిది మోహము నీవేమి చెప్పేవే
వొక్కమాఁటె సారెసారెనొట్టుకొని చవిగొంటే
మొక్కలానఁ బంచదార మొగచాటుగాదా

చ.2:
గాఁటపుసతులఁబొంది కాయాటైన వానికి
యేఁటికిఁ గరఁగీ గుండె యెమిచెప్పేవే
మేఁటియై మేనినిండా మితిలేక పెట్టుకొంటే
నీఁటున బంగారైన నిండా వేఁగుగాదా

చ.3:
ఊరఁ జుట్టపు శ్రీ వేంకటోత్తముఁడైనవానికి
యేరీతిఁ దమిరేగీనేమి చెప్పేవే
యీరీతి నన్నునేలె యింకాఁ గొసరితేను
పేరఁబెట్టితే పాలు పెరుగేకాదా