పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/242

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0141-4 శంకరాభరణం సంపుటం: 07-240

పల్లవి:
నీవె విచ్చేయవయ్య నేరుపరివిందుకెల్ల
నీవనిత యలుకలు నేము దిద్దఁగలమా

చ.1:
మాఁటవోరువఁగలేని మంకు దానిఁ గేరడాలు
యేఁటికినాడితివయ్య యింతలో నీవు
వాఁటమై పారెఁ గన్నీటీవరదలు చన్నులపై
నీఁటున నింతటెలుక నేము దిద్దఁగలమా

చ.2:
కాఁకకోరువఁగలేని కాంతకుఁ గోపమురేఁచి
సోఁకింతురా కొనగోరు చురుకనను
వేఁకపు నిట్టూరుపులు విసరీ హారములపై
యేఁకటనింతేసి పనులేము దిద్దఁగలమా

చ.3:
రవ్వకోరువఁగలేని రమణితో జూజాలాడి
నవ్వుదురా శ్రీ వేంకటనగవిహార
పువ్వులు కొప్పువి రాలె పొందితే బుజాలమీఁద
నివ్వటిల్లు మీవోజలు నేము దిద్దఁగలమా