పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/239

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0141-1 మాళవిగౌళ సంపుటం: 07-237

పల్లవి:
ఒక్కరియెంగిలి సొత్తుకొకరాసపడుదురా
దక్కని సామ్ములకును తానేల వచ్చీని

చ.1:
పయ్యదంటి నీవు నన్నుఁ బైకొనఁగా వచ్చి యీపె
కయ్యమడువఁ దనకుఁ గలదా పని
ఇయ్యడనేకతమున యిద్దరమునుండఁగాను
దయ్యమువలె నిప్పుడు తానేల వచ్చీని

చ.2:
చెంది నీవు నాతొడపై శిరసువెట్టుకుండఁగా
సందుచొచ్చి చూడనేమి సమ్మందము
సందుడివలపుల సదమదమై వుండఁగా
దందు పసురమువలె తానేల వచ్చీని

చ.3:
నిగిడి శ్రీ వేంకటేశ నీవు నన్నుఁ గూడితేను
తగునని పొాగడఁగఁ దనకేమి
మొగము చూచుకొని ముచ్చట నీతో నాడఁగా
తగిలి పొట్టేలువలె తానేల వచ్చీనే