పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/238

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0140-6 బౌళిరామక్రియ సంపుటం: 07-236

పల్లవి:
ఎక్కడ నేరిచితివే యేడలేని వేసాలు
వెక్కసాలేల చేతి విడమియ్యఁ గదవే

చ.1:
మువ్వంకల నీకునీవె ములిగేవు సారెసారె
నవ్వులకాడినమాట నాటెనటవే
పవ్వళించి అప్పటి నీపానుపుపైఁ బొరలేవు
పవ్వుల వేసినపోటు బొప్పిగట్టెనటవే

చ.2:
కప్పుచుఁ బయ్యదకొంగు కడునొడ్డించుకొనేవు
తప్పక చూచినచూపు తాఁకె నటవె
తిప్పి తిప్పి చూచేవు తేరకొనఁ జన్నులపై
కప్పురము చల్లితే కసుగందె నటవే

చ.3:
కినిసి యంతటలోనె కిందుపడి మొక్కేవు
వొనరఁ గాఁగిలించితే వొత్తెనటవే
యెనసి శ్రీ వేంకటేశునెదురుగాఁ గొసరేవు
చెనకితే మేనిమీఁద జీరవారె నటవే