పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/237

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0140-5 కేదారగౌళ సంపుటం: 07-235

పల్లవి:
ఒక్కరికిఁ జెప్పరాదు వూఁకొనరాదు
పక్కననేమనినాను పైఁడికతవంటిదే

చ.1:
ఆరెఁ దేరె నెడమాటలాడించ మీతోనేలే
చేరి తానే యడిగితేఁ జెప్పీఁ గాని
గోర గీరితే నీరయ్యూ గుట్టుననుండనియ్యరే
మేర మీరితే నతని మెప్పించేఁ గాని

చ.2:
వక్కణగా నాకుమీఁద వాసి పంపనేలే నా
దిక్కునఁ జూచితేఁ దనకే తెలిపేఁ గాని
వొక్కటంటే రెండయ్యీనూరకే వుండనియ్యరే
వెక్కసమైతేఁ దనతో వెలయించేఁగాని

చ.3:
తప్పులెంచి అందరిచేఁ దగవులఁ బెట్టనేలే
యిప్పుడే యేకతమ్మెతే యెంచేఁగాని
వుప్పు చిందినుముడయ్యి వొనరె నుండఁగనీరే
కప్పి శ్రీ వేంకటేశుఁ గాఁగిలించేఁగాని