పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/234

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0140-2 శంకరాభరణం సంపుటం: 07-232

పల్లవి:
ఎన్నఁడు లేనిగురుతులిదె నీమేనఁ గంటిమి
సన్నల యీసుద్దులెట్లు చవిసేసేవే

చ.1:
చెదరెను నీకురులు చెమట చెక్కుల నిండె
యెదురి మెచ్చఁగ నర్ధమేమి చెప్పేవే
వదలె నీమొలనూలు వాడెను నీకెమ్మోవి
పాదలి యిందుకెట్లా బొంకఁగలవే

చ.2:
కంకణాలు వదలెను గందపుఁబూఁత చిట్లి
వంకలొత్తి యిందుకెట్టు వాదించేవే
సుంకుమోపెఁ బలుకులఁ జూపులఁ గొత్తలు దోఁచె
సంకెలేక యివియెట్లు సటలనేవే

చ.3:
మోమునఁ గళలు నించె ముక్కున నిట్టుర్చురేఁగె
యీమాటకుత్తరమెట్లిచ్చేవే మాకు
ఆముక శ్రీ వేంకటేశుఁడన్నిటాను నిన్నుఁగూడె
ఆమని సెలవినవ్వులాఁపనెట్లు వచ్చునే