పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/228

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0139-2 సౌరాష్ట్రం సంపుటం: 07-226

పల్లవి:
చేసినట్టే సేసుఁగాక చెప్పేదేమి
సేస వెట్టినట్టి తన చేతి లోని దానను

చ.1:
వేడుకకు వెలలేదు వెన్నెలకుఁ గాటువోదు
ఆడనీవే తన మాట కడ్డము లేదు
గోడ గడుగవచ్చునా కొసరఁగనిఁకనేల
కూడిన తన సతుల గుంపులలోని దానను

చ.2:
జవ్వనము పొల్లవోదు చలిగాలి బొందువోదు
నవ్వనీవే తనవావి నడుమఁబోదు
గవ్వ వొరయవచ్చునా కక్కసించ నిఁకనేల
కువ్వగాఁ బోసిన తనకొలువులోదానను

చ.3:
తియ్యవిల్లు చప్పుగాదు దీకొన్న వలపు వోదు
యియ్యనీవే తన మోవికెంగిలిలేదు
పయ్యదంటి శ్రీ వేంకటపతి నన్నునిదె కూడె
యియ్యెడఁ దాఁ బవళించే యింటిలోనిదానను