పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/226

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


0138-2 కేదారగౌళ సంపుటం: 07-224

పల్లవి:
నీవింత యలుగుదురా నివ్వెరగుతోనుందురా
మూవంక వీఁగీ వాఁడె మొక్కుదువో యంటాను

చ.1:
వాకిటనున్నాఁడు వాఁడె వనిత నీరమణుఁడు
తూకొని నీవెదురువత్తువో యంటాను
చేకొనిచాఁచీ వాఁడె చేయి నీమీఁదనతఁడు
యీకడఁ గైదండ నీవిత్తువో యంటాను

చ.2:
తప్పక చూచీ వాఁడె తరుణి నీమోముదిక్కు
చొప్పుగా మారుకుమారు చూతువంటాను
వొప్పుగఁ బవళించీని వొద్ద నీవునట్టి వచ్చి
దప్పిదేరఁ బవళించి తమకింతువంటాను

చ.3:
మాటలాడీనదె వాఁడె మర్మములు సోఁకఁగ
కోటులుగ నీవు పలుకుదువంటాను
గాఁటమైకూడెను శ్రీ వేంకటపతి యిదె వీఁడె
మేటివై వురముమీఁద మెరతువంటాను