పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/224

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0138-1 యాలపదాలు - దేసాళం సం: 07-223

చ.1:
మేడలెక్కి నిన్నుఁజూచి - కూడేననే యాస తోడ
వాడు దేరి వుస్సురందురా-వేంకటేశ యాడనుంటి విందాకానురా
పిక్కటిల్లు చన్నులపై - చొక్కపు నీ వుంగరము
గక్కన నేనద్దుకొందురా- వేంకటేశ లక్కవలె ముద్రలంటెరా
దప్పిగొంటివని నీకుఁ- గప్పురము పారమిచ్చి
ముప్పిరి నీవిరహానను - వేంకటేశ నిప్పనుచు భ్రమసితిరా
నిండఁబూచిన మావిపై- గండుఁగోవిల గూయఁగా
నిండిన నీయెలుఁగంటాను వేంకటేశ అండకు నిన్ను రమ్మంటిరా
వుదయచందురుఁ జూచి- అదె నీపంజని సవి
యెదురుకేనే వచ్చితిరా - వేంకటేశ బెదరి మారుమోమైతిరా
మిన్నక కేళాకూళీలో వున్న తమ్మివిరులు నీ
కన్నులంటా జేరఁబోఁగాను - వేంకటేశ పన్ని మరునమ్మలాయరా
అనిన తుమ్మెదలు నీ - మేనికాంతిఁ బోలునని
పూనిచేతఁ బట్టఁబోఁగాను వేంకటేశసునాస్తుని వేగులాయరా
కందువ మై చమరించి గందవొడి చల్లుకొని పొంద
నిన్ను దలఁచితిరా వేంకటేశా అంద చొక్కుమందులాయరా
బొండుమల్లె పానుపుపై నుండి నిన్నుఁ బాడి పాడి
నిండుజాగరములంటిరా -వేంకటేశ యెండలాయ వెన్నెలలురా
నిద్దిరించి నీవు నాకు - వొద్దునుండఁ గలగంటి
చద్దివేఁడి వలపాయరా- వేంకటేశ సుద్దులింకా నేమి సేసేరా
మల్లెపూవు కొనదాఁకి ఝల్లనను బులకించి
వుల్లము నీకొప్పించితిరా-వెంకటేశ కల్లగాదు మమ్ముఁ గావరా
జోడుగూడి నీవు నేను- నాడు కొన్న మాటలెల్లా
గోడలేని చిత్తరువులై- వేంకటేశ యాడా నామతిఁ బాయవురా
అద్దము నీడలు చూచి ముద్దు మోవి గంటుండఁగా కొద్దిలేని కాఁకతోడను - వేంకటేశ పొద్దువోకతమకింతురా

పావురమురెక్కఁ జీటి- నీవొద్దికిఁ గట్టియంపి
దేవరకే మొక్కుకొందురా - వేంకటేశ నీవిందు రా వలెనంటాను
బంగారు పీఁటపైనుండి- ముంగిటకి నీవురాఁగా
తొంగిచూచి నిలుచుండఁగా - వేంకటేశ యెంగిలిమోవేలడిగేవు
దంతపుఁ బావాలు మెట్టి- పంతాన నేను రాఁగాను
యింతలో బలిమిఁ బట్టేవు - వేంకటేశ అంత నీకుఁ బ్రియమైతినా
పట్టు చీర కొంగు జారి- గుట్టు తో నేనుండఁగాను
వట్టి నవ్వు లేల నవ్వేవు - వేంకటేశ దిట్టవు నీ యంతవారమా
కొప్పుపట్టి తీసి నీవు -చెప్పరాని సేఁత సెసి
తప్పక నెఁ జూచినంతలో - వేంకటేశ చిప్పిలేల చెమరించేవు
బొమ్మల జంకించి నిన్ను- తమ్మిపూవున వేసితే
కమ్మియేల తిట్టు దిట్టేవు - వేంకటేశ నిమ్మపంట వేతునటరా
నెత్తమాడేనంటా రతి- పొత్తుల పందేలు వేసి
వొత్తి నీవే వోడే వేలరా - వేంకటేశ కొత్తలైన జాణవౌదువు
వున్నతి శ్రీవెంకటేశ మన్నించి కూడితివిదే
నన్నునెంత మెచ్చు మెచ్చేవు - వేంకటేశ కన్నులపండువలాయరా
చిలుకలు మనలోన- కలిసిన యట్టివేళ
పలుకు రతిరహస్యాలు - వేంకటేశ తలఁచినేఁ దలపూఁతరా
నీకు వలచిన వలపు- లాకలెత్తె నామతిని
వాకున నేఁ జెప్పఁ జాలరా - వేంకటేశ లోకమెల్లా నెరిఁగినదే