పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/223

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0137-6 వరాళి సంపుటం; 07-222

పల్లవి:
ఇసుక పాతర యిందుకేది కడగురుతు
రసికుఁడ నన్నునింత రవ్వశాయనేఁటికి

చ.1:
బయలు వలెనుండును పట్టరాదు వలపు
మొయిలువలెనుండును ముద్దశాయరాదు
నియతములేదించుకు నేరిచినవారిసొమ్ము
క్రియ యెరుంగుతా నన్నుఁ గెరలించనేఁటికి

చ.2:
గాలివలెఁ బారుచుండు కానరాదు మనసు
పాలవలెఁ బొంగుచుండు పక్కననణఁగదు
యేలీలా గెలువరాదు యెక్కితే యేనుగగుజ్ఞు
లోలోనె మమ్మునింత లోఁచి చూడనేఁటికి

చ.3:
వెన్నెలే కాయుచునుండు వింతగాదు వయసు
అన్నిటా వసంతరుతువై యుండుఁ బోదు
వున్నతి శ్రీ వేంకటేశుఁడుండనుండఁ జవి వుట్టు
మన్నించె యింక మారుమాటలాడనేఁటికి